తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి సెక్యూరిటీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అన్నామలైకి భారీ సెక్యూరిటీని కల్పిస్తూ..ఏకంగా జెడ్ కేటగిరి భద్రతను ఇవ్వనుంది. అన్నామలై రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించనున్నారు.
అయితే ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలైకి గతంలో వై కేటగిరి సెక్యూరిటీ ఉంది. ఇటీవల కాలంలో తమిళ నాడు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నామలై. అధికార డీఎంకే పార్టీ తప్పిదాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ మధ్యే ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
కోయంబత్తూర్ బాంబు పేలుడు ఘటనలో తమిళనాడు డీఎంకే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి ఉగ్రవాద ఘటనపై డీఎంకే ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తుందంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి అన్నామలైకి బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం అన్నామలైకి భద్రతను అప్ గ్రేడ్ చేసింది కేంద్రం.
అయితే ఇటీవల కాలంలో తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఇస్లామిక్ టెర్రరిజం స్లీపర్ సెల్స్ పెరుగుతున్నాయి. నిషేధిత పీఎఫ్ఐ కార్యకలాపాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకుడికి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక తమిళనాడుకు చెందిన అన్నామలై 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం. కర్ణాటక కేడర్ అధికారిగా ఆయన ఆ రాష్ట్రంలో పలు చోట్ల పని చేశారు. 2019 లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన ఆయనకు ఆ పార్టీ ఏకంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది.