తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. దర్శనం క్యూలైన్‌లో తమిళనాడు, గుంటూరు భక్తుల మధ్య చిన్నపాటి వివాదం రేగింది. అలా ఒక్కసారిగా గొడవకు కారణమైంది. గుంటూరుకి చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడికి పాల్పడ్డారు. వెంటనే టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగేలా చేశారు.
ఈ దాడి ఘటనకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట ప్రాంతంలో క్యూలైన్ లైన్‌లో దర్శనానికి వెళ్లే రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. క్యూలో ముందూ, వెనుక వెళ్లే విషయంలో ఒకరినొకరు తోసుకోవడంతో వాగ్వాదం జరిగింది.
రెచ్చిపోయిన తమిళ భక్తులు.. మిగతా భక్తులు సర్దిచెప్పినా వినకుండా దాడి చేసినట్లు తెలుస్తోంది. భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో భక్తుల మధ్య చిన్న, చిన్న తోపులాటలు జరుగుతున్నాయి. కానీ ఈ గొడవ మాత్రం కాస్త ఘర్షణ వరకు వెళ్లింది. భక్తులు సంయమనంతో ఉండి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ సూచించింది.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని సోమవారం 83వేల 223మంది భక్తులు దర్శించుకున్నారు. 36వేల 658మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీకి రూ4.7 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది. శిలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్‌లలో ఉన్నారు. దర్శనానికి 35 గంటల సమయం పడుతోంది.