తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇయ్యనార్ పాలెం వద్ద ఆరు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై రెండు ప్రైవేట్ బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే… నంగనల్లూర్కు చెందిన విజయరాఘవన్ తన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో చెన్నై వెళ్తున్నారు. ఇయ్యనార్ పాలాయం ఫ్లై ఓవర్ వద్ద వర్క్ జరగుతోంది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో విజయ రాఘవన్ కారును రోడ్డుపై ఆపాడు. అప్పుడే వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ రాఘవన్ కారును ఢీ కొట్టింది. ముందున్న మరో లారి ఉండటంతో రెండింటి మధ్య కారు నుజ్జు నుజ్జు అయింది. దీంతో కారులోని రాఘవన్ కుటుంబం మరణించింది.
స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.