మరణం అనేది ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. తమిళనాడులో ఓ వ్యక్తికి మృత్యువు టైర్ రూపంలో ఎదురైంది. రోడ్డుపై వెళుతున్న సదరు వ్యక్తిని ట్రక్కు నుంచి ఊడిపోయిన టైర్ వచ్చి ఢీకొట్టింది. దీంతో అతను మరణించాడు.
ఈ ఘటన తమిళనాడులోని పెరంబదూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లో వెళితే… ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు వెళుతున్నాడు. ఆ క్రమంలో అక్కడ నుంచి వెళుతున్న ఓ ట్రక్కు టైర్ ఊడిపోయింది.
ఆ టైర్ వేగంగా వెళుతూ ఆ వ్యక్తిని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి స్థానికులు తరలించారు. కానీ అప్పటికే వ్యక్తి మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆ వ్యక్తి పేరు మురళి అని, పెరంబదూర్ లో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడని పోలీసులు వివరించారు. కిరాణ సామాన్లు తీసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.