తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వేదికపై ఉండగా పార్టీ కార్యకర్తను డీఎంకే మంత్రి కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సేలంలో గురువారం డీఎంకే కార్యక్రమం జరిగింది. ఇటీవల మంత్రివర్గంలో చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దీంతో ఆయనను చూసేందుకు, కలిసి కరచాలం చేసేందుకు డీఎంకే కార్యకర్తలు పోటీపడ్డారు. క్యూకట్టిన కార్యకర్తలు వేదికపై ఉన్న ఉదయనిధి వద్దకు వరుసగా వచ్చి కలిశారు. కాగా, ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలను నియంత్రించేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేఎన్ నెహ్రూ స్వయంగా రంగంలోకి దిగారు.
ఉదయనిధి పక్కనే నిల్చొన్న ఆయన కార్యకర్తలు త్వరగా ముందుకు కదిలేలా వారిని లాగారు. ఈ నేపథ్యంలో తలపై టోపీ ధరించి ఉదయనిధిని కలిసిన ఒక కార్యకర్తను మంత్రి నెహ్రూ స్వల్పంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ నెలలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నెహ్రూ డీఎంకే కౌన్సిలర్‌ను చెప్పుతో కొట్టి వార్తల్లో నిలిచారు. అలాగే ఈ వారంలో పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌ఎం నాసర్ తిరువళ్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు. తనకు కుర్చీ తీసుకురావడంలో జాప్యం చేసినందుకు పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ కూడా నాడు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.