తమిళనాడులో ఒమిక్రాన్ బీఏ4 వేరియంట్ తొలి కొవిడ్ కేసు నమోదైంది. రాష్ట్రంలో ఓ టీనేజ్ వ్యక్తిలో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 19 ఏండ్ల యువతిలో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు.
ఆమెతో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. ఆమె ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, వ్యాక్సిన్ తీసుకోని వారు త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
నవలూరులోని గేటెడ్ కమ్యూనిటీలో యువతి కుటుంబం నివసిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఆమెకు, ఆమె తల్లికి ఈ నెల 4న స్వల్ప ఫ్లూ లక్షణాలు కనిపించాయన్నారు. దీంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలినట్టు వివరించారు.