తమిళనాట తెలుగువారు ఎదుర్కొంటున్న భాషాపరమైన సమస్యలను పరిష్కరించడం పట్ల దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్ లకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వారిద్దరికీ మంగళవారం లేఖ రాశారు.
ఏపీ, తెలంగాణ తరువాత అత్యధికంగా తెలుగువారున్న రాష్ట్రం తమిళనాడేనని.. ఇక్కడ సుమారు 2 కోట్ల మంది తెలుగువారు నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 1956 విభజన చట్టంలోని భాషాపరమైన అంశాలు తమిళనాట సరిగా అమలు కావడం లేదని లేఖలో వివరించారు. అందువల్ల ఇక్కడున్న మైనారిటీల హక్కులకు భంగం కలుగకుండా తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడాలని ఆయన కోరారు.
తమిళనాడులో తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తెలుగు రెండో భాషగా అమలు చేయడంతో పాటు.. వారు నివశించే ప్రాంతాల్లోని ఆలయాల్లో తెలుగువారిని ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా నియమించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. తెలుగు తెలిసిన అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తమిళం చదువుకుంటేనే ఉద్యోగం అన్న చట్టం ఉన్నందున.. తెలుగు చదువుకున్న ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగు రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల నేతలు తెలుగు గ్రంథాలయాలను ఏర్పాటు చేసి తెలుగును సులభంగా నేర్చుకునేందుకు పాఠ్యపుస్తకాలు రూపొందించి.. ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కేతిరెడ్డి. ఇక్కడ 40 శాతానికి పైగా తెలుగువారున్నప్పటికీ వారి వివరాలను చూపడంలో అధికారులు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారాయన. ‘నిర్బంధ తమిళం’ చట్టం పరిధి నుంచి తెలుగును తొలగించి.. తెలుగువారు తమకిష్టమైన భాష చదువుకునేలా వెసులుబాటు కల్పించేలా చర్యలు చేపట్టాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కోరారు కేతిరెడ్డి.