సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. తమిళనాడులో ఉద్యోగ, విద్యా రంగంలో వన్నియార్ కులస్తులకు అమలు చేస్తున్న 10.5 శాతం రిజర్వేషన్లను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.
రిజర్వేషన్లపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఆ రిజర్వేషన్లు రాజ్యంగ బద్దం కాదని, సమానత్వ హక్కును అది ఉల్లంఘించినట్టేనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ రిజర్వేషన్లను ప్రకటించింది. గతేడాది నవంబర్ 1న వీటిని పక్కన పెడుతూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది.
ఆ రిజర్వేషన్లు ఆర్టికల్స్ 14, 15, 16 (సమానత్వ హక్కు, మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధించడం; ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో సమానత్వం) ఉల్లంఘన కిందకు వస్తుందని అని కోర్టు పేర్కొంది.
ఉద్యోగ, విద్యారంగాల్లో వన్నియార్ కులస్తులకు 10.5 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది వన్నియార్ రిజర్వేషన్ చట్టం- 2021 పేరిట చట్టాన్ని తీసుకు వచ్చింది.