పార్లమెంట్ నూతన భవనంలో స్పీకర్ సీటు దగ్గర సెంగోల్‌ను ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన తర్వాత ‘సెంగోల్’ను లోక్‌సభ స్పీకర్ సీట్ వద్ద ప్రధాని మోడీ స్వయంగా ప్రతిష్టిస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. దీంతో అసలు ఏంటీ ఈ ‘సెంగోల్’,ఎక్కడ నుంచి వచ్చి… అసలు దీని వెనుక వున్న స్టోరీ ఏంటనే విషయాలపై ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది.
సెంగోల్ అనే రాజదండానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. భారతీయులకు, బ్రిటీష్ వారికి మధ్య జరిగిన అధికార మార్పిడికి సూచికగా ఈ సెంగోల్ నిదర్శనంగా వుంది. అలాంటి సెంగోల్ ను మొదటి సారిగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వీకరించారు. ఈ ‘సెంగోల్’ అనే పదం ‘సెమ్మై’ అనే తమిళ పదం నుంచి వచ్చింది. దీనికి తమిళంలో ధర్మం అని అర్థం వస్తుంది.
‘సెంగోల్’ ఏర్పాటుకు కారణం ఇదే..!
భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించేందుకు బ్రిటీష్ వారు రెడీ అయ్యారు. ఆ సమయంలో అప్పటి బ్రిటీష్ వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూతో మాట్లాడారు. భారత్‌కు అధికారాలు బదిలీ కాబోతున్నాయని, దీన్ని సూచించేలా ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే బాగుంటుందని మౌంట్ బాటెన్ నెహ్రూతో అన్నారు. దీంతో నెహ్రూ ఆలోచనలో పడ్డారు.
ఈ క్రమంలో అప్పటి భారత గవర్నర్ జనరల్ రాజగోపాల చారీ సలహాను నెహ్రూ కోరారు. దీంతో చోళ రాజ వంశంలో కొత్తగా ఎవరైనా రాజు సింహాసనాన్ని అధిష్టించే సమయంలో రాజదండాన్ని స్వీకరిస్తారని చెప్పారు. అలాగే భారత్ కూడా బ్రిటీష్ నుంచి స్వతంత్ర్యం పొంది స్వయం పాలనా మొదలు పెడుతున్నందున మనం కూడా అలానే చేస్తే బాగుంటుందన్నారు. దీంతో ఈ విషయాన్ని మౌంట్ బాటెన్ తో చర్చించి దానికి నెహ్రూ ఒకే చెప్పారు.
అప్పుడు రాజగోపాల్ చారి ‘సెంగోల్’ను తయారు చేయించేందుకు మద్రాసులోని తిరువడుతురయైలోని ఓ మఠానికి వెళ్లారు. అక్కడ ఈ విషయం గురించి ఆ మఠాధిపతులతో చర్చించారు. రాజాజీ చెప్పిన విషయం ఆధారంగా ఓ స్వర్ణ కారున్ని పిలిపించి మఠాధిపతులు ఈ సెంగోల్ ను తయారు చేయించారు.
ఈ సెంగోల్ ఐదు అడుగుల పొడవు వుంటుంది. ‘సెంగోల్’ పైభాగంలో న్యాయానికి ప్రతీకగా నందిని చెక్కారు. దాన్ని గంగా జలంలో శుద్ది చేసి ప్రభుత్వ ప్రత్యేక వాహనంలో ఢిల్లీకి తీసుకు వచ్చారు. ఆ తర్వాత 15 అగస్టు 1947న మౌంట్ బాటన్ నుంచి నెహ్రూ ఈ సెంగోల్ ను స్వీకరించారు.
ఈ రాజ దండం ప్రస్తుతం అలహాబాద్ లోని మ్యూజియంలో ఉంది. దీన్ని ఈ నెల 28న పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో దీన్ని పార్లమెంట్ భవనంలో అమర్చనున్నారు. నూతన పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను పెట్టడం భారత సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త తరానికి అందించినట్లు అవుతుందని అమిత్ షా అన్నారు. పార్లమెంట్ నూతన భవన నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టికి ఉదాహరణ అని అమిత్ షా కొనియాడారు.