యాదాద్రీశ్వరుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన శుక్రవారం వటపత్రశాయి అలంకార సేవలో స్వామి వారు ఊరేగారు. కల్యాణ మండపంలో స్వామివారిని దివ్య మనోహరంగా వట పత్రాలపైన అలంకరించారు.
పశ్చిమ రాజగోపురం గుండా సేవను తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపం పై ఆస్థానం చేసి, వేదమంత్రాలు, దివ్యప్రబంధ పాశురాలను పఠించారు. మాడవీధుల్లో ఊరేగిన శ్రీస్వామి వారి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఉదయం 9.05 గంటలకు యాదగిరి గుట్టకు చేరిన గవర్నర్.. మొదటగా స్వయంభూ నరసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతరం స్వామి వారి వటపత్రశాయి అలంకార సేవలో పాల్గొన్నారు. ఇక ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అనువంశిక ధర్మకర్త, ఈవో గీత, ఆలయ అధికారులు పాల్గొన్నారు.