పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. ఒక వేళ చట్టంతో సమస్య వస్తే దానికి వ్యతిరేకంగా తానే ముందు గొంతు విప్పుతానని అన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో రజినీకాంత్ తన వైఖరిని స్పష్టం చేశారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తప్పనిసరి అని అన్నారు.
దేశ విభజన సమయంలో ఇండియాలోనే ఉండిపోయిన ముస్లింలను వెళ్లిపోమని ఎవరైనా అంటారా ? అని ప్రశ్నించారు. విద్యార్ధులు ఒక విషయాన్ని తమ ప్రొఫెసర్లతో చర్చించి, విశ్లేషించిన తర్వాతనే నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. సీఏఏతో భారతీయులకు ఎలాంటి సమస్య లేదని…కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయంటూ కేంద్రం తెలిపిందని రజినీకాంత్ చెప్పారు. డిసెంబర్ నెలలో సీఏఏ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింస జరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన రజినీకాంత్ సమస్య పరిష్కారానికి హింస మార్గం కాదన్నారు. దేశ భద్రత, సంక్షేమం కోసం భారతీయులంతా ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలని రజినీకాంత్ పిలుపునిచ్చారు.