దేశంలో రోజు రోజుకు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను తిరస్కరిస్తున్నారని అమాయకపు యువతులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా హన్మకొండలో ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించాలంటూ.. ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. యువతి ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
నర్సంపేట సమీపంలోని లక్నంపల్లి గ్రామానికి చెందిన అనూష కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లిదండ్రులతో కలిసి హన్మకొండలోని పోచమ్మకుంట సమీపంలో నివాసం ఉంటోంది. అయితే, మొండ్రాయి గ్రామానికి చెందిన అజార్ అనే యువకుడు.. కొంత కాలంగా ప్రేమించాలంటూ అనూషను వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో అతడి ప్రేమను తిరస్కరించడంతో శుక్రవారం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న అనూషపై కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనూషకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.