ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో గవర్నర్ మరోసారి ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పైగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఇంకోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ప్రోటోకాల్ విషయంలో గవర్నర్ ను అవమానిస్తూ వస్తోంది టీఆర్‌ఎస్ సర్కార్. దీనిపై కేంద్రానికి రిపోర్ట్ అందించారు తమిళి సై. దానిపై కేంద్రం ఏం చేయాలో అది చేస్తుందని తెలిపారు. తాను ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని చెప్పారు. అయినా తాను ప్రజాసేవ తప్ప ప్రోటోకాల్ పట్టించుకోనని స్పష్టం చేశారు.
రాజకీయం చేస్తున్నానని కొందరు అనవసరంగా విమర్శిస్తున్నారన్న గవర్నర్.. తనపై జరుగుతున్న ట్రోలింగ్ పైనా స్పందించారు. తాను ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని చెప్పలేదని.. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదాలున్నా రాజ్ భవన్ ను గౌరవిస్తున్నారని గుర్తు చేశారు. తనకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని స్పష్టం చేశారు.
తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారని.. ఈ విషయంపైనే చర్చించేందుకు కేంద్రం తమిళిసైని ఢిల్లీకి రమ్మని చెప్పిందని ప్రచారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ గొడవల కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోందని వార్తలు వచ్చాయి. అయితే.. తాను నెలవారీ రిపోర్ట్ ఇచ్చేందుకే వచ్చానని అన్నారు తమిళిసై. ఇటు ధాన్యం కొనుగోలు అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీ కోసం కాంగ్రెస్ కోరిందని.. దానికి సంబంధించి లేఖను సంబంధిత వర్గాలకు పంపించానని తెలిపారు.