తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించారని ఆమె అన్నారు. గవర్నర్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు అని ఆమె ప్రశ్నించారు.
గణతంత్ర దినోత్సవం అంశంపై తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. తాను ఎక్కడా తన హద్దులు దాటలేదని ఆమె పేర్కొన్నారు. గత 25 ఏండ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని వెల్లడించారు. ప్రొటోకాల్ ఏంటో తనకు తెలుసని ఆమె పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి తాను రాజకీయాలు మాట్లాడనన్నారు. ప్రోటోకాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రొటోకాల్‌పై సీఎం కేసీఆర్ స్పందించిన తర్వాతే ప్రభుత్వ ప్రశ్నలకు తాను సమాధానం చెబుతానన్నారు.
గవర్నర్ వ్యవస్థను కించపరచడం మంచిది కాదని ఆమె హితవు పలికారు. తన విధులు తాను నిర్వహిస్తున్నానన్నారు. తన దగ్గర ఎలాంటి సమస్య లేదన్నారు. గవర్నర్ కుర్చికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. తాను స్వతంత్రంగా పని చేస్తున్నానని, తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు.