పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మరో రాష్ట్రం తీర్మానం చేసింది. తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా నడుమ తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం స్టాలిన్. దీంతో కేరళ, పంజాబ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ తర్వాత తమిళనాడు కూడా సీఏఏ వ్యతిరేక రాష్ట్రాల లిస్టులోకి చేరింది.
2019లో పార్లమెంట్ సీఏఏను ఆమోదించింది. అయితే ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక సిద్ధాంతాలకు అనువుగా లేదన్నారు సీఎం స్టాలిన్. అంతేకాదు దేశంలో మత సామరస్యం సాఫీగా సాగేలా లేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలోనూ ఇవే అంశాలను హైలెట్ చేసింది స్టాలిన్ సర్కార్.
ఈ తీర్మానంపై చర్చను అడ్డుకున్నారు బీజేపీ, అన్నాడీఎంకే సభ్యులు. సభ నుంచి వాకౌట్ కూడా చేశారు. అయితే అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నందున డీఎంకే సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించింది.