తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పోలీసు కేసు నమోదయింది. రాష్ట్రంలో వలస కార్మికులపై డీఎంకే వర్గాలు దాడులకు పాల్పడుతున్నాయనే వదంతుల నేపథ్యంలో హింసను ప్రేరేపిస్తున్నారనే ఆరోపణపై ఆయన మీద చెన్నై పోలీసులు కేసు పెట్టారు. అలాగే బీజేపీ బీహార్ ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ పై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఫేక్ న్యూస్ ని వ్యాప్తి చెందింపజేస్తున్నారని, ఉత్తరాది ప్రజల పట్ల తమిళ ప్రజలకు ఎలాంటి ద్వేషభావం లేదని అన్నామలై ట్వీట్ చేశారు.
నార్త్ ఇండియన్స్ పై పాలక డీఎంకే విద్వేషపూరిత ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకంగా డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ సహా ఈ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను అన్నామలై తన ట్వీట్ కి జోడించారు. ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా ఏడు దశాబ్దాలుగా డీఎంకే చేస్తున్న ప్రచారాన్ని బట్టబయలు చేసినందుకే నాపై ఆ పార్టీ కేసు పెట్టింది అని ఆయన అన్నారు. దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి అని ఆయన సవాలు చేశారు.
అయితే వలస కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదని, తప్పుడు వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారని స్టాలిన్, పోలీసు వర్గాలవారు కూడా స్పష్టం చేశారు. వక్రీకరించిన వీడియోను అన్నామలై షేర్ చేశారని డీఎంకే ఆరోపిస్తోంది. ఫేక్ వదంతులను ప్రచారం చేయడాన్ని మానుకోవాలని తాను బీజేపీ నేతలను కోరుతున్నానని ఈ పార్టీ అధికారప్రతినిధి ఏ. శరవణన్ పేర్కొన్నారు. ఇక తమిళనాడులో వలస కార్మికులకు పూర్తి భద్రత ఉందని గవర్నర్ ఆర్.ఎన్. రవి హామీ ఇచ్చారు. ఉత్తరాది నుంచి ఈ రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులు ఎలాంటి భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదన్నారు.
వలస కార్మికుల విషయంలో తమిళనాడు, బీహార్ రాష్ట ప్రభుత్వాల మధ్య సమస్యవంటిది ఏర్పడింది. బీహార్ నుంచి కొందరు అధికారులు, పోలీసులు తమిళనాడుకు వచ్చి పరిస్థితిని మదింపు చేస్తున్నారు.