తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెరుగు ప్యాకెట్లపై హిందీలో ‘దహి’ అని ముద్రించాలన్న ఆదేశాలపై రచ్చ జరుగుతోంది. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలను తమిళనాడులోని రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి.
అవసరమైతే దక్షిణ భారత దేశంలో మరోసారి భాషా ఉద్యమాన్ని తీసుకు వస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే దక్షిణ భారత్ లో హిందీ భాషపై నిషేధం తీసుకు వచ్చేలాగా ఉద్యమాన్ని కూడా తీసుకు వస్తామని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు.
ఈ ఆదేశాలపై తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ మాతృభాషలను నిసిగ్గుగా అగౌరవ పరిచడానికి బాధ్యులైన వారిని దక్షిణాది నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఈ విషయంలో స్టాలిన్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సమర్థించారు. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఛైర్ పర్సన్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర పరిధిలోని అంశాలపై కేంద్ర సంస్థలు జోక్యం చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఈ నోటిఫికేషన్ కు ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి పొంతన లేదని ఆయన వెల్లడించారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాంటి నిబంధనలు తగవన్నారు. ఈ విషయంపై తాము కేంద్రంతో మాట్లాడుతామని పేర్కొన్నారు. ఆ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళతామని వివరించారు.