కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రంగానే ఉన్నా.. తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. అయితే పరిమిత సంఖ్యలో.. కేవలం 300 మంది మాత్రమే ఇందులో పాల్గొనాలని నిబంధన విధించింది. పోటీలో పాల్గొనేవారు విధిగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని.. నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే అనుమతించాలని నిర్వాహకులకు సూచించింది. ఏటా సంక్రాంతి సమయంలో తమిళనాడులో జల్లికట్టు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా అయితే ఈ పోటీలో వేల సంఖ్యలో యువకులు పాల్గొని ఎద్దులను నిలువరించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కానీ కరోనా కారణంగా తమిళనాడు ఈ కార్యక్రమంపై పరిమితిని విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు పోటీలను ఓపెన్ గ్రౌండ్‌లోనే నిర్వహించాలని.. అలాగే 50 శాతం మంది మాత్రమే హాజరవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. జల్లికట్టును చూసేందకు వచ్చేవారికి కచ్చితంగా థర్మల్ స్కానర్‌తో టెస్ట్ చేయాలని.. మాస్క్ ధరించేలా చూడాలని… అలాగే భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
తమిళనాడులో అలంగానల్లూరులో జరిగే జల్లికట్టుకు ఎంతో పేరుంది. వీటిని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు వస్తుంటారు.