ఎజెండా అంశాల చుట్టూ తాండూరు మున్సిపల్ రాజకీయం నడుస్తోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎజెండా అంశాలపై కొందరు మద్దతు తెలపగా మరికొందరు తిరస్కరించారు. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు చైర్ పర్సన్ స్వప్న. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె పలు విషయాలను వివరించారు.
ఈనెల 22న కౌన్సిల్ సమావేశంలో ఇన్చార్జ్ కమిషనర్… చైర్ పర్సన్ సంతకం లేని ఎజెండాను ప్రవేశ పెట్టి.. ఆమోదం అవుతుందని తెలపడంపై అభ్యంతరం తెలిపారు స్వప్న. దీనిపై న్యాయం కోసం మున్సిపల్ చట్టం ప్రకారం హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. గురువారం తమకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆమె ధీమాగా ఉన్నట్లు తెలిపారు.
అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్లు, కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు కుమ్మక్కై ఎజెండా అంశాలను ఆమోదం చేశారని ఆరోపించారు స్వప్న. చైర్ పర్సన్ సంతకం లేని ఎజెండా చట్ట విరుద్ధమన్నారు. అయితే.. అందులో ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులకు తాము ఏమాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో చైర్ పర్సన్ హక్కులను కాపాడేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు స్వప్న. మరికొందరు కౌన్సిలర్లు ఎజెండా అంశాలలో మున్సిపల్ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లుగా పేర్కొన్నారని చెప్పారు. చరిత్రలో ఇప్పటివరకు చైర్ పర్సన్ సంతకం లేనిది ఎజెండానే కాదని.. కోర్టులో న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నారు.