మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో న్యూడ్ ఫోటోలు కలకలం రేపాయి. ఇక తెలంగాణలో మొన్నటి వరకు న్యూడ్ వీడియో కాల్స్ హల్ చల్ చేయగా ఇప్పుడు న్యూడ్ ఫోటోలతో కంత్రీగాళ్లు బ్లాక్ మెయిల్ దందాకు దిగారు. ఇంట్లో సమస్యలు తొలుగుతాయని, డబ్బులు కురుస్తాయని నమ్మబలకడంతో మహిళలు వాళ్ల ట్రాప్ లో పడిపోయారు.
దీంతో వారిని బ్లాక్ మెయిల్ చేసి,నగరానికి తీసుకొచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో సంచలనంగా మారింది. చెప్పినట్టుగా వింటే ఇంట్లో నోట్ల వర్షం కురుస్తుందని కేటుగాడు మహిళలను నమ్మించాడు. అతని మాటలకు అమాయక ఆడవారు నిజంగానే సమస్యలు తొలిగిపోతాయన్న భ్రమలోకి వెళ్లారు. వారి కష్టాలు తొలగిపోయి మంచి జీవనం సాగుతుందని ఆశపడడంతో.. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ తాంత్రికుడు పూజలు చేయాలని చెప్పి మోసానికి దిగాడు. ఫోటోలు ఎందుకు అని అడిగినా.. పూజలకు అవసరమని మాయమాటలు చెప్పాడు ఆ దుర్మార్గుడు.
న్యూడ్ ఫోటోలు అయితే ఇంకా త్వరగా సమస్యలు తొలగిపోతాయని మహిళలను నమ్మించి మహిళల న్యూడ్ ఫోటోలు తీశాడు. తాంత్రిక పూజలకు ఉపయోగిస్తున్నానని చెప్పి హైదరాబాద్ లోని మరో తాంత్రికుడికి పంపించాడు. అంతే కాకుండా పూజల పేరుతో పలువురు మహిళల్ని హైదరాబాద్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు.
ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదని ఒక వేళ చెబితే ఇప్పటి వరకు చేసిన పూజలు ఫలించవని బెదిరించాడు. దీంతో మహిళలు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో తాంత్రికుడి గుట్టురట్టైంది. ఈ ఘాతుకానికి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇద్దరు పురుషులతో పాటు ఒక మహిళ కూడా ఉండడం గమనార్హం.
అయితే ఇప్పుడు సమస్యంతా.. వీరు ఆ న్యూడ్ ఫోటోలను ఎవరెవ్వరికి పంపించారు..వీళ్లు ముగ్గురే ఇలా మహిళలపై తాంత్రిక పూజలని ఇలా చేస్తున్నారా.. వీరితో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.