గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న నందమూరి తారకరత్న(ఎన్టీఆర్) కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయానికి ఆయన నివాసానికి తరలిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
1983 ఫిబ్రవరి 22న జన్మించారు తారక రత్న. నందమూరి వారసుడిగా 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి రికార్డులకెక్కారు. ప్రపంచంలో ఏ హీరో తారకరత్నలా ఒకేరోజు 9 సినిమాలను ప్రారంభించలేదు. ఈ అరుదైన రికార్డ్ ఆయనకే సొంతం. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో రెండు చిత్రాలు ఉన్నాయి. అలాగే, మిస్టర్ తారక్ అనే మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. లాస్ట్ ఇయర్ 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఫ్యాషన్ డిజైనర్ ఆలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న తారకరత్నకు నిష్క అనే కుమార్తె ఉంది.
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, భక్త సిరియలు, సారధి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు తారక రత్న. 2009లో అమరావతి చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇంకోవైపు టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా భావించారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. మొదటిరోజు లోకేష్ తోపాటు కాసేపు నడిచారు. అయితే.. యాత్రలో నడుస్తూనే కుప్పకూలిపోయారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.