నందమూరి తారకరత్న…వివాద రహితుడు. విద్యావంతుడు. స్నేహశీలి. సౌమ్యుడు. పాదయాత్రకని ఇంటినుంచి బయలుదేరి అంతిమయాత్ర కోసం తిరిగి వచ్చాడు. అత్యంత చిన్న వయసులో మృత్యువడికి చేరుకోవడంతో..ఆ మనిషి ఇక లేడని, రాడని జీర్ణించుకోలేకపోతున్నారు సన్నిహితులు.
గుండెపోటుతో కుప్పకూలిన ఆయన దాదాపు 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి సరిగ్గా మహాశివరాత్రి రోజు (ఫిబ్రవరి 18)న తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఈనెల 20న తారకరత్న అంత్యక్రియలు జరగ్గా తాజాగా చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. నందమూరి తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత, చెల్లెలు రూప, బాలకృష్ణ ఫ్యామిలీ, గారపాటి లోకేశ్వరి, నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కల్యాణ్ రామ్ ఫ్యామిలీ, ఇతర కుటుంబ సభ్యులు చిన్న కర్మలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు సైతం తారకరత్న చిన్న కర్మలో పాల్గొన్నారు. నిర్మాతలు సురేష్ బాబు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, నటుడు అజయ్, దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత ఆదిశేషగిరి రావు, పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత సి.కళ్యాణ్, నటుడు బెనర్జీ, తదితరులు హాజరై తారకరత్న చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు.
తారకరత్న చిన్నకర్మ కార్యక్రమంలో ఆయన భార్య అలేఖ్యరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త ఇకలేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నఆమె భర్తతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇదే సందర్భంలో తారకరత్న పెద్ద కుమార్తె నిషిక తల్లిని ఓదార్చింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చడం ఖాయం.
కన్నీరు ఆపుకోలేకపోతున్న అలేఖ్యను ఆమె కుటుంబ సభ్యులంతా ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక తారకతరత్నను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించిన బాలయ్య ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నారు.
అన్నయ్య మోహనకృష్ణతో కలిసి అతిథులను ఆహ్వానించడంతో పాటు తారకరత్న కూతురు నిషికతోనూ, కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతూ కనిపించారు. ముఖ్యంగా బాలయ్యకు నిషిక తన ఫోన్‌లో ఏదో చూపిస్తుండడం..
దాన్ని బాలకృష్ణ తీక్షణంగా చూస్తూ వివరాలు అడగడం ఆసక్తికరంగా అనిపించింది.
కాగా తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉంటానని బాలయ్య మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మాటను నిలబెట్టుకుంటూ తన బిడ్డ చిన్న కర్మ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు.