తారకరత్న భౌతికకాయం రంగారెడ్డి జిల్లాలోని మోకిళ్లలో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంది. నందమూరి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. గత నెల 27న కుప్పంలో అస్వస్థతకు గురైన తారకరత్న నిన్న బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అక్కడి నుంచి ఆయన భౌతిక కాయాన్ని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు తరలించారు.
ఈరోజు ఆయన నివాసంలోనే పార్థీవదేహాన్ని పెట్టనున్నారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మహేశ్ బాబు, అక్కనేని చైతన్య, అల్లరి నరేష్ తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇక నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. 1983 ఫిబ్రవరి 22న జన్మించిన ఆయన 2012 లో అలేఖ్య రెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులో కథానాయకుడిగా తారకరత్న తెరంగేట్రం చేశారు. కథానాయకుడు, ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఆయన. 2001 లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో సినీరంగానికి పరిచయం అయ్యారు. ఒకే సారి 9 సినిమాలు మొదలుపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు.
23 సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటించారు. 2006 తరువాత మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2009 లో అమరావతి చిత్రంతో మళ్లీ సినీ జీవితం మొదలుపెట్టి..ఆ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు వచ్చింది. రాజా చెయ్యి వేస్తే చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటించారు.