తారకరత్న హఠాన్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ముందుగా భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్ కు తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు. ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు తారకరత్న కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే.. ఫిబ్రవరి 22న తారక్ బర్త్ డే. సరిగ్గా తన పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందే ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. జనవరి 27న గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో జాయిన్ అయ్యారు తారకరత్న. పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారని, తన బర్త్ డే వేడుకల్లో పాల్గొంటారని అంతా భావించారు. కానీ, ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, నందమూరి ఫ్యాన్స్ ను దుఃఖ సాగరంలోకి నెట్టింది.
రంగారెడ్డి జిల్లాలోని మోకిళ్లలోని ఇంట్లో తారకరత్న భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పార్థివదేహన్ని సందర్శించారు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు తారకరత్న. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. మొదటిరోజు లోకేష్ తోపాటు కాసేపు నడిచారు. అయితే.. యాత్రలో నడుస్తూనే కుప్పకూలిపోయారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.