నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు చేరుకున్నారు. 22 రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతున్న తారకరత్న వైద్యానికి సహకరించడం లేదని తెలుస్తోంది.
తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యంపై ఏ సమయంలోనైనా హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లోకేష్ తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
అప్పటి నుంచి తారకరత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విదేశీ వైద్యులను పిలిపించి మరీ తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు.