సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్టేట్ వచ్చింది. తారకరత్న ఆరోగ్యంపై ఆయన బాబాయ్..నందమూరి రామకృష్ణ స్పందించారు. సోమవారం మధ్యాహ్నం తారకరత్నను ఐసీయూలో చూసి బయటికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు.
ఆయన ఆరోగ్యం నిన్న,మొన్నటితో పోలిస్తే కాస్త మెరుగుపడిందని రామకృష్ణ తెలిపారు. అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. అయితే ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారన్నారు. తారకరత్నకు ఎక్మో పెట్టారన్న వార్తలపై రామకృష్ణ స్పందించారు.
ఎక్మో పెట్టలేదని..అవన్నీ అవాస్తవాలేనని రామకృష్ణ కొట్టిపారేశారు. రామకృష్ణ చెప్పిన ఈ ఒక్క మాట నందమూరి, నారా ఫ్యామిలీ, అభిమానులు, టీడీపీ కార్యకర్తలకు కాస్త ఉపశమనం కలిగించేదని చెప్పుకోవచ్చు. సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని రామకృష్ణ చెప్పారు.
ఐసీయూలో న్యూరాలజిస్టుల పర్యవేక్షణ మధ్య తారకరత్న వైద్యం తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. సోమవారం తారకరత్నకు సిటీ స్కాన్ చేశారు వైద్యులు. ఈ రిపోర్టు రావడానికి ఇంకాస్త సమమం పట్టేలా ఉంది. ఓ వైపు రిపోర్టులో ఏం వస్తుందనే దానిపైనా కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారాయణ హృదయాలయ ఆస్పత్రిలోనే ఉంటూ వైద్యులను అడిగి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు మెదడు పని తీరుపై ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించినట్లు ఇదివరకు చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా 10 మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారు.