ఏడేళ్ల మోడీ పాలన, కేసీఆర్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్. నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆయన.. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. సీఎం నిరుద్యోగులను మోసం చేశారని.. ఉద్యోగాల భర్తీపై మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రం కోసం పోరాడిన యువతను కేసీఆర్ మర్చిపోయారన్న ఆయన.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పెద్దపీట వేస్తోందన్నారు.
దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి మోడీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తోందన్నారు తరుణ్ చుగ్. అసలు.. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు రాక అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. యువత చేసిన పోరాటంతోనే కేసీఆర్ కు అధికార పీఠం దక్కిందని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ చేస్తానని.. అందర్నీ మభ్య పెట్టారన్నారు.
ప్రతీ ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ను ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు తరుణ్ చుగ్. ఉద్యమకారులంతా బీజేపీ వెంట నడుస్తున్నారన్న ఆయన… టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీంగా మారిందని ఆరోపించారు.