వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కారు కూలడం ఖాయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ జోస్యం చెప్పారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పదాధికారుల మీటింగ్ లో తరుణ్ చుగ్ మాట్లాడారు.
‘బండి’ చేపట్టిన పాదయాత్ర రెండు విడతలు విజయవంతమైందని, సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. మొదట దేశం..తర్వాత పార్టీ..ఆ తర్వాతనే కుటుంబం అనేది బీజేపీ నినాదమని వివరించారు. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు ఆయన పాలనలో విసిగిపోయారని, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ విషయాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.
నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్ ప్రజలకు ఏం చేసిందో వివరించాలని, ఈ క్రమంలోనే కేసీఆర్ ఇచ్చిన హామీలన్ని నీటిమూటలేని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. అధికార టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారని, కమిటీల ద్వారా వారిని పార్టీలో చేర్చుకోవాలని పేర్కొన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ ఒక్కరికి ఇండ్లు నిర్మిస్తామని, ఉద్యోగాలను భర్తీ చేస్తామని తరుణ్ చుగ్ హామీనిచ్చారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు కష్టపడుతున్నారని చెప్పారు.