కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో పరిపాలన ఇలాగే కొనసాగితే భారత్ కూడా ఆఫ్ఘనిస్థాన్ మాదిరిగా తాలిబన్ల రాజ్యంగా మారుతుందని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తరుణ్ చుగ్ రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ కు తాలిబన్లు అంటే ఎవరో తెలియదని..కాని నిజమైన తాలిబన్లు ఎవరో అందరికి తెలుసని చురకలంటించారు.
కేసీఆర్ ను ఉద్దేశించి తాలిబన్లు గురించి చెప్పుకొచ్చారు. ఆదివారం ఢిల్లీలో మాట్లాడిన తరుణ్ చుగ్ తాలిబన్లు అంటే ప్రభుత్వ వాహనంలో బాలికపై అత్యాచారం చేసిన వాళ్లు అని అన్నారు. తాలిబన్లు అంటే అత్యాచారం చేసి వాహనాన్ని నడిపించిన అధికార పార్టీ నేతల పిల్లలు, అత్యాచార ఘటనలో ఉన్న బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల నేతలు అని విరుచుకుపడ్డారు.
దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయని వాళ్లు తాలిబన్లు అని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వని వాళ్లు తాలిబన్లు అవుతారని, పేదల రక్తం పీల్చుకునే వాళ్లు తాలిబన్లు అంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అధికారం చేజారిపోతోందన్న ఆందోళనలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. ముందు రాష్ట్రంలో పరిపాలనను చక్కబెట్టుకొని తరువాత దేశ రాజకీయాల గురించి మాట్లాడాలని కేసీఆర్ కు ఆయన హితవు పలికారు.