బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పనుల్లో రాష్ట్ర నేతలు బిజీబిజీగా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ లో ముఖ్య నాయకుల భేటీ జరిగింది. రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా కార్యవర్గ సమావేశాలపై చర్చ జరిగింది. దీనికోసం ఏర్పాటు చేసిన కమిటీలతో చర్చలు జరిపారు నేతలు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు తరుణ్ చుగ్. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా టూర్ కు సంబంధించిన వివరాల్ని వివరిస్తూనే.. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. జూలై 1న సాయంత్రం నడ్డా అధ్యక్షతన పార్టీ జాతీయ కార్యదర్శుల భేటీ ఉంటుందని.. దీనికి 138 మంది బీజేపీ ఆఫీస్ బేరర్లు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొంటారని పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండా, చేయాల్సిన తీర్మానాల గురించి నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.
ఇక టీఆర్‌ఎస్ పాలనపై మాట్లాడుతూ.. ప్రజలకు బంగారు తెలంగాణ కలలను చూపించి బంగారు కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ సాకారం చేసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్, కవిత, హరీశ్, సంతోశ్ సహా ఎంతోమంది కేసీఆర్ కుటుంబీకుల చేతిలో తెలంగాణ బందీగా మారిందని మండిపడ్డారు. తెలంగాణ కోసం తాము చేసిన త్యాగాలను వృథా చేసేలా కేసీఆర్ నిరంకుశంగా పాలిస్తున్నారనే ఆందోళన ఉద్యమకారుల్లో ఉందని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో 529 రోజులే మిగిలి ఉన్నాయన్నారు తరుణ్ చుగ్. ప్రతీరోజు బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తాయని ప్రకటించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఇకపై తెలంగాణ బీజేపీ చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్ కౌంట్ డౌన్ బోర్డును వినియోగిస్తామన్న తరుణ్ చుగ్.. ప్రతీ బీజేపీ కార్యాలయం ముందు ఆ బోర్డును ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలక చర్యలు తీసుకుంటోంది హైకమాండ్. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ఇంచార్జ్ లుగా నియమించింది. దీనికి సంబంధించి లిస్ట్ రెడీ చేసిన కేంద్ర నాయకత్వం దాన్ని రాష్ట్ర నాయకత్వానికి కూడా పంపింది. జాబితాలో కేంద్రమంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.