ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ ‘బుర్కా’ వివాదం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. గతంలో ఆమె బుర్కా వేసుకోవడంపై ట్రోల్స్ చేసిన వారికి ఖతీజా గట్టిగానే సమాధానం ఇచ్చి వాళ్ల నోళ్లు మూయించినప్పటికీ మళ్లీ ఆమె బుర్కా వివాదం మరోసారి తెర మీదకొచ్చింది. అయితే ఈ సారి ట్రోల్స్ చేసింది ఎవరో కాదు..ప్రముఖ బంగ్లాదేశీ రచయిత, ఫెమినిస్టు, తన రచనల ద్వారా ముస్లిం మతోన్మాదాన్ని ఎండగడుతూ బంగ్లాదేశ్ పాలకుల ఆగ్రహానికి గురై ఇండియా శరణుజొచ్చన తస్లీమా నస్రీన్.
తస్లీమా…ఖతీజా రెహమాన్ బుర్కా గురించి ప్రస్తావిస్తూ..”నేను రెహమాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతాను..కానీ వాళ్ల అమ్మాయిని చూస్తే ఉక్కపోతగా ఉంటుంది…మంచి సంస్కృతి కలిగిన కుటుంబంలో పుట్టిన ఒక చదువుకున్న మహిళను కూడ ఎంత సులభంగా మనసు మార్చవచ్చునో తెలిసి బాధేస్తోంది” అని ఫిబ్రవరి 11 న ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
తస్లీమా వ్యాఖ్యలపై ముస్లిం కార్యకర్తలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.తాజాగా ఖతీజా రెహమాన్ కూడా ఆమె ట్వీట్ పై స్పందించారు. తాను సాధికారిత పొందినందుకు గర్వపడుతున్నాను..ఏమి ధరించాలనేది నా ఇష్టానికి సంబంధించినదని తెలిపారు. ” డియర్ తస్లీమా నస్రీన్…నేను వేసుకున్న డ్రెస్ చూసి మీరు ఉక్కపోతకు గురైతే సారీ…కొంచెం ఫ్రెష్ గాలికి వెళ్లండి…నాకు మాత్రం ఏం ఉక్కపోతగా లేదు…నేను గర్వపడుతున్నాను…నేను సాధికారిత సాధించినందుకు…నిజమైన ఫెమినిజం అంటే ఏమిటో గూగుల్ లో చూడమని సూచిస్తున్నాను…ఎందుకంటే ఇతర మహిళలను కించపర్చడం…వాళ్ల తండ్రులను వివాదంలోకి లాగడం ఫెమినిజం కాదు…నేను నా ఫోటోలు కూడా మీరు చూడడానికి పంపాలనుకోవడం లేదు” అంటూ డైరెక్ట్ గా తస్లీమానేకే రాశారు.
ఖతీజా ఫోటోను పెట్టి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు తీవ్రం రావడంతో ఖతీజా ఫోటోలను, ఆమెను ఉద్దేశించి చేసిన పోస్టును తస్లీమా డిలేట్ చేశారు. ఆ తర్వాత ” బుర్కావాలాలు సాధికారికత పొందారు…యుద్ధమే శాంతి…స్వేచ్ఛ అంటే బానిసత్వం…అజ్ఙానమే బలం..” అంటూ ఖతీజా ను ఎద్దేవ చేస్తూ ట్వీట్ చేశారు.
గత ఏడాది ఓ అవార్డు ఫంక్షన్ లో రెహమాన్ కూతురు బుర్కా ధరించడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దానికి రెహమాన్ సమాధాన మిస్తూ తమ కుటుంబంలో మహిళలు వారికిష్టమొచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ ఉందని సమాధానమిచ్చారు.