ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఇద్దరూ ఇటీవల గుజరాత్ లో గోల్ఫ్ కార్ట్ (వెరైటీ వాహనం) ఎక్కినప్పుడు వారు చేసిన గిమ్మిక్కులపై రైటర్ తవ్లీన్ సింగ్ స్పందించారు. ఆ సమయంలో రోమన్ పాలకులు, వారి సర్కస్ లు తనకు గుర్తొచ్చాయన్నారు. ప్రజాస్వామ్య బధ్ధంగా ఎన్నికైన ఇద్దరు నేతలు ప్రవర్తించవలసిన తీరు ఇదేనా అనిపించిందని ఆమె ఓ ఆర్టికల్ లో పేర్కొన్నారు.
ఢిల్లీ నుంచి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ల్యూటెన్స్ సహచరులుగా భావిస్తున్నవారు తనకు కాల్ చేసి ఈ వైనాన్ని ఎగతాళిగా అభివర్ణించారని, అయితే మోడీకి పెరుగుతున్న అప్రూవల్ రేటింగ్స్ ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారని తాను భావించానని ఆమె ఎద్దేవా చేశారు. బహుశా సగటు భారతీయ ఓటరును ఆయన మెస్మరైజ్ చేశారని వారు గ్రహించలేకపోయారనుకున్నానన్నారు.
ప్రపంచం దృష్టిలో ఇండియా స్టేటస్ ని మోడీ పెంచేశారని సగటు ఓటర్లు తనతో తరచు చెప్పేవారన్నారు. ఇటీవల రాజస్థాన్ లోని గ్రామీణ ప్రాంతాల్లో నేను పర్యటించినప్పుడు ఓ వ్యక్తిని, నువ్వెందుకు మోడీ ‘భక్తుడివిగా’ మారావని ప్రశ్నించినప్పుడు.. జీ-20 ని ఆయన ఇక్కడికి ఎలా ‘తెచ్చారో’ .. ఇండియాకు ఎంత ప్రతిష్ట తెచ్చారో చూడాలని వ్యాఖ్యానించాడని తవ్లీన్ సింగ్ తెలిపారు. జీ-20 గురించి నీకేం తెలుసునని ప్రశ్నించినప్పుడు.. వాళ్ళు బడా ధనిక విదేశీయులని, ఇండియాలో పెట్టుబడులు పెడతారని ఆ వ్యక్తి చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అంటే ‘బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ల్యూటెన్స్ అనుచరులుగా మనలను మనం భావిస్తున్న వారికన్నా సగటు ఓటరు మనస్తత్వాన్ని మోడీ ఎంత బాగా అర్థం చేసుకున్నారన్నది తెలిసివచ్చిందన్నారు.
‘ఒకప్పుడు నేనూ మోడీ భక్తురాలినే.. మోడీ జాతీయ రాజకీయాలకు ఎదుగుతున్నారని గుజరాత్ నుంచి మొదట రూమర్లు వచ్చి అవి
ఢిల్లీ డ్రాయింగ్ రూములు, కారిడార్లనుంచి వ్యాప్తి చెందిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆయన ప్రధాని అవుతారన్నదే అప్పట్లో టెరిఫయింగ్ న్యూస్ గా ఉంటూ వచ్చింది. ఆ నాడే ల్యూటెన్స్ అభిమానులు.. తాము అప్పటివరకు దాచుకున్న ప్రివిలేజ్ గోడలను ఆయన బద్దలు కొడతాడని భయపడుతూ వచ్చారు. ఇప్పుడు అదే జరిగింది’ అని ఈ వ్యాసకర్త అభిప్రాయపడ్డారు.