యూపీలో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(సీజీ ఎస్టీ) అధికారులు దాడులు నిర్వహించారు. హమీన్ పూర్ లో ఓ గుట్కా వ్యాపారి ఇంట్లో బెడ్ లో డబ్బు కట్టలను గుర్తించారు. గుట్కా వ్యాపారి ఇంట్లో అంత పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడటం చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు.
సుమర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా వ్యాపారి జగత్ గుప్తా ఇంట్లో అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 6 గంటలకు మొదలైన సోదాలు బుధవారం సాయంత్రం వరకు జరిగాయి. ఈ సోదాల్లో సుమారు 15 మంది అధికారులు పాల్గొన్నారు.
డబ్బు కట్టలు ఎక్కువగా ఉండటంతో వాటిని లెక్కించడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో కౌంటింగ్ మిషన్లను తెప్పించి నోట్లను లెక్క పెట్టారు. మొత్తం డబ్బు లెక్కపెట్టేందుకు కొన్ని గంటలు పట్టింది. చివరికి మొత్తం 6 కోట్ల 31 లక్షల రూపాయలు ఉన్నట్టు అధికారులు లెక్కించారు. అనంతరం డబ్బును అధికారులు సీజ్ చేశారు.
సీజ్ చేసిన మొత్తాన్ని హమీన్ పూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించినట్టు అధికారులు వెల్లడించారు. వ్యాపారికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వ్యాపారి ఇంట్లో కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.