తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 111 రద్దు చేయడంపై సంచలనమైన నిర్ణయం తీసుకుంది టీ కాంగ్రెస్. ఈ మేరకు ఏడుగురు సభ్యులతో నిజ నిర్థారణ కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సూచనతో కమిటీ ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
కోదండ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నర్సింహా రెడ్డి, జ్ఞానేశ్వర్, ఆర్థికవేత్త లుబ్న శర్వాట్, డాక్టర్ జస్వీన్ జైరథ్ తదితరులు సభ్యులతో కమిటీ వేసినట్లు వివరించారు. అంతకు ముందు చైర్మన్ కోదండ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం జరిగింది.
111 జీవోను ప్రభుత్వం ఎత్తి వేయడం వల్ల జరిగే నష్టం, తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. పర్యావరణ వేత్తలతో పాటు అన్ని వర్గాలతో సమావేశమై లోతుగా అధ్యయనం చేసి నివేదిక అందజేస్తామన్నారు కోదండ రెడ్డి.
జీవో 111 రద్దుపై టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో నెంబర్ 111 రద్దుతో జంట నగరాల్లో విధ్వంసం జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో జీవో నెం.111 ఎత్తివేతపై రూ.లక్షల కోట్లలో కుంభకోణం జరుగుతుందని రేవంత్ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీని వేయనున్నట్లు రేవంత్ వెల్లడించారు. దీంతో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని భూములు కొన్నారో తేల్చుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ జీవో వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ధ్వజమెత్తారు రేవంత్. మొత్తం భూములన్నీ కొన్న తర్వాత.. ఇప్పుడు జీవో రద్దు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధన దాహం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.