ఆర్టీసీ బస్సుకు హైదరాబాద్ లో మరో యువతి బలైంది. మలక్ పేట లో టెంపరరీ డ్రైవర్ నడుపుతున్న ఆర్టీసీ బస్సు ఓ యువతిపై నుంచి దూసుకెళ్లిన సంఘటన మర్చిపోక ముందే హైదరాబాద్ లో మరో సంఘటన జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ ౩ లో యాక్టివా బైక్ పై నుంచి వెళ్తున్న సోహిని సక్సేనా అనే యువతిపై నుంచి బర్కత్ పురా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఆమె తల టైర్ కింద పడి తల చిన్నాభిన్నమైంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. బస్సు అద్దాలను పగులగొట్టారు. మృతురాలు సోహిని సక్సేనా టాటా కన్సల్టెన్సీ సర్వీసులో ఉద్యోగం చేస్తున్నట్టు ఆమె ఐడీ కార్డు ఆధారంగా గుర్తించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లను నియమించుకొని బస్సులను నడిపిస్తోంది. ఈ తాత్కాలిక డ్రైవర్లు సరైన శిక్షణ ఉన్నవాళ్లు కాకపోవడం వల్ల రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టింపులకు పోయి తాత్కాలిక డ్రైవర్లతో నడిపిస్తూ తమ ప్రాణాలు తీస్తుందని ప్రజలంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారు. వారికి కనీసం 90 రోజుల శిక్షణ ఇప్పించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.దీనిపై సోమవారమే విచారించిన కోర్టు ఆర్టీసీని వివరణ కోరుతూ విచారణను వాయిదా వేసింది.