ఏపీ అసెంబ్లీ సమావేశాలు వివాదాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రతీ రోజు శాసన సభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం.. వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే తెలుగు దేశం పార్టీ బండారం బయట పెడతానంటూ అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేదాన్ని ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కల్తీ సారా మరణాలు లేవని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వ్యాపారంలో కల్తీ వల్ల ఎవరెవరు చనిపోయారో జాబితా ఉందన్నారు నారాయణ. బాబు లాలూచీ పడి ఎంత మందికి డిస్టలరీలు మంజూరు చేశాడో బయట పెడతానన్నారు. మా ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ దొరక్కే ఈ అంశం ఎత్తుకున్నాడని మండిపడ్డారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు నారాయణ స్వామి.