ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించింది. 23 ఓట్లతో అనురాధ విజయం సాధించారు. నిజానికి టీడీపీ అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి.
వాస్తవానికి టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు ఎన్నికల అనంతరం వైసీపీకి జై కొట్టారు. ఈ లెక్కన టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 19 మాత్రమే. ఎమ్మెల్యే కోటాలోని ఏడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపగా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధాను ప్రకటించారు.
ఒకవేళ అధికార వైసీపీపై అసమ్మతి గళం వినిపించిన.. కోటంరెడ్డి, ఆనం టీడీపీకి ఓటు వేసినా.. ఆ పార్టీ బలం 21కి చేరుతుంది. కానీ అనూహ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరెవరు టీడీపీకి ఓటు వేశారనేది తెలియాల్సి ఉంది.
ఇక ఎన్నికలపై ఆది నుంచి టెన్షన్ నెలకొంది. ఏడు స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని అధికార వైసీపీ నేతు చెబుతూ రాగా.. ఆ ఒక్కటి మాదే అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. మొత్తంగా 23 ఓట్లు రావడంతో టీడీపీ అభ్యర్థి అనురాధ విక్టరీ కొట్టారు.