గన్నవరంలో ధ్వంసమైన పార్టీ కార్యాలయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం సందర్శించారు. పార్టీ ఆఫీసుని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన తీరును చంద్రబాబుకు పార్టీ నేతలు వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరంలో భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారన్నారు. గన్నవరం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? నేను గన్నవరం వద్దామనుకుంటే రానివ్వరా? అని మండిపడ్డారు. క్రిస్టియన్ అని ఎఫ్ఐఆర్ లో పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారు? అంటూ నిలదీశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులు, పోలీసుల మక్కెలిరగ్గొడతాం అంటూ హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోనే ఈ విధంగా ఉంటే.. పులివెందుల్లో ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో భయాన్ని సృష్టించారన్నారు. కార్లు, స్కూటర్లు డ్యామేజ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
ఎందరో మహానుభావులు చరిత్ర సృష్టించిన ప్రాంతం గన్నవరం అన్నారు చంద్రబాబు. అలాంటి గన్నవరంలో రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ చెప్పినట్టు పోలీసులు చేస్తే ఇబ్బందులు పడడం ఖాయమన్నారు.
టీడీపీ కార్యకర్తలు ఎవరికీ భయపడరు. కొందరు బుద్ధిలేని పోలీసులు డ్యూటీలో ఉన్న లాయర్లను కూడా అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. ఏపీని కాపాడుకునేందుకు ఉద్యమించాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో టీడీపీకి ప్రజల సహకారం కావాలన్నారు చంద్రబాబు.