మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర అరెస్ట్‌పై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని, వెంటనే నరేంద్రను విడుదల చేయాలని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు. రాత్రి సమయంలో నేమ్ బ్యాడ్జ్‌లు లేకుండా నరేంద్ర ప్లాట్‌లోకి ప్రవేశించిన ఏడుగురు వ్యక్తులు.. తాము సీఐడీ అధికారులమని చెప్పి అతన్ని తీసుకెళ్లారన్నారు. టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు చంద్రబాబు.
ప్రతిపక్ష టీడీపీ నేతలు, క్యాడర్‌ను టార్గెట్ చేయడంలో సీఐడీ పూర్తిగా నిమగ్నమైందని, సెక్షన్ 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యలున్న నరేంద్ర ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మొత్తం పోలీసు శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు చంద్రబాబు. సుప్రీం కోర్టు మార్గ దర్శకాలకు విరుద్ధంగా రాత్రి సమయంలో నరేంద్రను అరెస్ట్ చేయాల్సిన ఏముందని? ఆయన నిలదీశారు.
టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేసి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో తెలిపారు. నరేంద్రను బేషరతుగా విడుదల చేయాలని, భవిష్యత్‌లో ఇలాంటి అక్రమ అరెస్టులు జరగకుండా చూడాలని లేఖలో డీజీపీని డిమాండ్ చేశారు చంద్రబాబు. వైసీపీ ప్రతీకార రాజకీయాలకు సీఐడీ సహకారం విస్మయం కలిగిస్తోందన్నారు.
అధికార పార్టీ ప్రయోజనాల కోసం సీఐడీ దిగజారడం బాధాకరమన్నారు. బాధితులను బెదిరించడం, కస్టడీలో చిత్ర హింసలకు గురి చేయడం కోసమే పోలీసులు ఈ తరహా అరెస్ట్ లు చేస్తున్నారన్నారు. దారపనేని నరేంద్రను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ఇలాంటి అక్రమ అరెస్టులు భవిష్యత్తులో జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నానని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు.