ఏపీ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనపై తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామి పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు చంద్రబాబు పేర్కొన్నారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సభలో జరిగిన ఘటనతో ముఖ్యమంత్రి జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రోద్భలంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిజంగా జగన్ పేరు నిలిచిపోతుందని.. అయితే చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా నిలిచిపోతారని దుయ్యబట్టారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ప్రతికూలంగా రావడంతో ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ ఓటమిని జీర్ణించుకోలేకే పిచ్చెక్కి జగన్ ఇలా వ్యవహరించారన్నారు. ఇది శాసన సభ కాదు.. కౌరవ సభ అని పేర్కొన్నారు చంద్రాబాబు.
అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలపై దాడి జరగడం దారుణమన్నారు. డోలా బాలవీరాంజనేయ స్వామిపై సుధాకర్ బాబు, ఎలీజాలు దాడి చేశారన్నారు. వెల్లంపల్లి మా స్థానంలోకి వచ్చి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడి చేశారని తెలిపారు. స్పీకర్ సైతం మా ఎమ్మెల్యే స్వామి పట్టుకున్న ప్లకార్డును తోసేశారన్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీలో జరిగిన వీడియో మొత్తాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. కౌరవ సభకంటే దారుణంగా అసెంబ్లీ తయారైందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాదక ద్రవ్యాలు సేవించి సభకు వచ్చారనే అనుమానం కలుగుతోందన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మినిట్ టూ మినిట్ వీడియోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెమెరాలు ఆఫ్ చేసి దాడి చేసి ఉంటారని అనుమానం కూడా వస్తోందన్నారు. అసెంబ్లీలో దాడి జరిగితే తిరిగి మమ్మల్నే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సాంబశివరావు.