ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ శ్రేణులపై జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలపై ఆయన ఏపీ డీజీపీకి లేఖ రాశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. అధికార వైసీపీకి చెందిన కొందరు నేతలు తమ అనుచరులను రెచ్చగొట్టి తమ కార్యాలయంపై దాడికి పురిగొల్పారని ఆరోపించారు.
వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని విమర్శించారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేశారని, అక్కడ ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారని మండిపడ్డారు. ఇక తమ పార్టీ నాయకుడు పట్టాభిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని అనుమానాలు ఉన్నాయని, పట్టాభిని పోలీసులే అరెస్ట్ చేశారా? లేక ఇంకెవరైనా ఎవరైనా కిడ్నాప్ చేశారా? అని ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ఆ లేఖలో చంద్రబాబు కోరారు.
కాగా గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు గన్నవరం టీడీపీ కార్యాలయంపై కొందరు దాడి చేశారు. కార్యాలయం ఆవరణలోని టీడీపీ ఫ్లెక్సీలను చించివేయడంతో పాటు కంప్యూటర్లు, ఫర్నీచర్ సహా విలువైన వస్తువులన్నీ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.
పార్టీ కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు. ఇక ఈ దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ఆయన అనుచరులే చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడ ఉండగానే, వారు చూస్తుండగానే వైసీపీ కార్యకర్తలు తమపై, పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని వారు విమర్శిస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా, మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఘటనపై ఆ పార్టీ నేతలు నిరసనకు దిగగా.. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద 60 మందికి పైగా తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే టీడీపీ నాయకుడు పట్టాభి, మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడంతో పాటు మరో సీనియర్ నేత బోడె ప్రసాద్ సహా ఇంకో 11 మందిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వైసీపీ శ్రేణులు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసి, తిరిగి తమపైనే కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.