గుడివాడ కేసినో వ్యవహారంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ఇష్యూను టీడీపీ వదలడం లేదు. తాజాగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు. ఢిల్లీలో ఈడీ అధికారులను కలిశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.
గుడివాడ కేసినో విషయాన్ని ఈడీ అధికారులకు వివరించారు టీడీపీ నేతలు. దీంతో.. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ విషయంలో అనేక ఫిర్యాదులు చేసింది టీడీపీ.
కొద్దిరోజుల క్రితం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన టీడీపీ నేతలు కేసినో వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. డీజీపీ, కలెక్టర్లకు కంప్లయింట్ చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా గవర్నర్ కు లేఖ రాశారు.
మరోవైపు ఈ కేసినో విషయంపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సంక్రాంతి సంబరాల సమయంలో గుడివాడలో మంత్రి కొడాలి నాని కేసినో నడిపారని టీడీపీ అంటోంది. తన కళ్యాణ మంటపంలో అలాంటిదేం జరగలేదని.. కావాలంటే నిరూపించాలని సవాల్ చేశారు నాని.