హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు టీడీపీ షాక్ ఇచ్చింది. బరిలో అభ్యర్థిని నిలిపింది. టీడీపీ ఒంటరి పోరు నిర్ణయానికి అసలు కారణం ఏంటి?
గత ఎన్నికల్లో పొత్తులో వెళ్లిన టీడీపీ ఈసారి పోటీ చేయాలని ఎందుకు నిర్ణయం ఎందుకు తీసుకుంది? టీడీపీ పోటీతో కాంగ్రెస్ విజయావకాశాలు సన్నగిల్లుతాయా..? టీడీపీ రాష్ట్ర నాయకత్వం హుజూర్‌నగర్ పోటీపై ఆసక్తిగా లేకపోయినా నల్గొండ జిల్లా నాయకులు ఎందుకు పట్టుబట్టారు ?
హుజూర్‌నగర్: టీడీపీ పోటీ చేయడానికి ఉత్తమ్ కారణం అంటున్నారు నల్గొండ జిల్లా నేతలు, ఉత్తమ్ ఆవేశం, అనాలోచిత నిర్ణయాలే ఆయన కొంపముంచేలా ఉన్నాయి అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. 2018 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా హుజూర్‌నగర్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పోటీ చేసి స్వల్ప తేడాతో గెలిచారు. హుజూర్‌నగర్‌లో టీడీపీకి క్యాడర్ బాగానే ఉంది. చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రాకు దగ్గరలో ఉండడం కూడా టీడీపీకి కలిసొచ్చే అంశం. ఒక సామాజిక వర్గం ఓట్లు 10 వేలకు పైగా ఉన్నాయి. అవి కచ్చితంగా టీడీపీ వైపే ఉంటాయి. టీడీపీ పోటీలో లేకుంటే ఆ ఓట్లలో మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థికి వస్తాయి. ఉపఎన్నికల్లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే. మిగతా ఎవరు పోటీ చేసిన డిపాజిట్ కోసం పోటీ పడాల్సిందే. టీడీపీ పోటీ చేసినా కూడా డిపాజిట్ రావడం కష్టమే. కానీ, కాంగ్రెస్ ఓటమికి మాత్రం పనిచేస్తాయి ఆ ఓట్లు. ఆ ప్రమాదాన్ని గ్రహించిన ఉత్తమ్ ముందుగానే టీడీపీని పోటీలో లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ పనిచేయలేవు.
టీడీపీ పోటీ చేయాలనే నిర్ణయానికి వందకు వంద శాతం ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణం అంటున్నారు జిల్లా నాయకులు. ఈ మధ్య కాంగ్రెస్‌లో రేవంత్ అండ్ సీనియర్స్ మధ్య చిన్న యుద్ధమే జరిగింది, రేవంత్ హుజూర్‌నగర్ అభ్యర్థిగా తన మనిషిని ప్రకటించడం, అసెంబ్లీలో భట్టి వ్యవహారశైలిపై నిలదీయడం జరిగిపోయాయి. తరువాత యురేనియం పోరాటం విషయంలో రేవంత్ చేసిన కామెంట్స్‌తో కాంగ్రెస్ సీనియర్లు వరుసగా రేవంత్‌పై ఎదురు దాడి చేశారు. తన నియోజవర్గం విషయంలో రేవంత్ వేలు పెట్టడాన్ని జీర్ణించుకొని ఉత్తమ్ ఒక అడుగు ముందుకు వేసి నల్గొండలో తన అనుచరులతో రేవంత్ దిష్టిబొమ్మల దహనం చేయించారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఏకంగా ఓటుకు నోటు దొంగ రేవంత్ అని విమర్శించాడు. ఇక్కడే టీడీపీ నేతలు బాగా హాట్ అయ్యారట. రేవంత్ అంటే టీడీపీ కార్యకర్తలకు ఇంకా అభిమానం ఉండడం ఒక ఎత్తు అయితే, ఓటుకు నోటు కేసు అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు. ఆ కేసులో చంద్రబాబు పేరు కూడా ఉండటంతో ఇక్కడ టీఆర్ఎస్ అస్తమానూ ఇదే ప్రస్తావన తెస్తూ ఆయన్ని టార్గెట్ చేస్తుంటాయి. ఇప్పుడు ఉత్తమ్ తన సన్నిహితులతో ఓటుకు నోటు దొంగ అంటూ విమర్శలు చేయించడం స్థానిక టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. రాష్ట్ర నాయకులు ఎల్ రమణ ‘పోటీ ఎందుకు.. కాంగ్రెస్‌కు మద్దతు ఇద్దాం’ అని చెప్పినప్పటికీ జిల్లా నాయకులు ఒప్పుకోలేదట. ‘మేము ఉత్తమ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు మద్దతు ఇచ్చి గెలిపించాం. 2018 ఎన్నికల్లో కూడా ఉత్తమ్ గెలుపులో టీడీపీ భాగస్వామ్యం ఉంది. అలాంటిది మన నాయకుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పాత కేసును ఉత్తమ్ తన అనుచరులతో బయటకు తీయించాడు. మనం మద్దతు ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు మన నేతలనే టార్గెట్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వడం.? మనం పోటీ చేసి టీడీపీ కార్యకర్తల సత్తా ఏంటో చూపిద్దాం..’ అని చెప్పారట దాంతో జిల్లా నాయకుల ఒత్తిడి మేరకు టీడీపీ హుజూర్‌నగర్‌లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికి తెలంగాణలో ప్రతి పల్లెలో టీడీపీకి ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్‌లోకి వెళ్ళడానికి ఇష్టం లేని నేతలు టీడీపీలో మిగిలిపోయారు. వాళ్ళు సైకిల్ గుర్తు లేకపోతే కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు తప్ప టీఆర్ఎస్‌కు వేయరు. నల్గొండలో టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉంది, ఇప్పడు ఈవీఎంలో సైకిల్ గుర్తు ఉంటే కచ్చితంగా ఆ ఓట్లు సైకిల్ గుర్తుకే వెళ్తాయి. సైకిల్ లేకుంటే చేతి గుర్తుకు వచ్చేవి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్వల్ప తేడానే ఎవరు విజేతనో నిర్ణయించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టీడీపీకి వచ్చే ఓట్లు ఉత్తమ్ కొంప ముంచేలా ఉన్నాయి.