ఐటీ దాడుల సాకుతో టీడీపీ పై వైసీపీ నేతలు, సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏ లు, పీఎస్ లకు పార్టీలతో సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు పి.ఎస్. శ్రీనివాస్ కు టీడీపీతో ఏం సంబంధం..? అతనొక ప్రభుత్వ అధికారి మాత్రమే. ఆయనపై దాడులు అతని వ్యక్తిగతం. వాటిని టీడీపీకి ముడిపెట్టడమంటే కావాలని బురద జల్లడమేనన్నారు. 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10-15మంది పీఎస్ లు, పీఏలు పని చేశారు. మాజీ పీఎస్ ఇంటిపై ఐటీ దాడులు జరిగితే వాటిని పార్టీకి అంటగట్టడం హేయమన్నారు. దేశవ్యాప్తంగా 40చోట్ల ఐటీ దాడులకు టీడీపీ కి సంబంధం ఏంటి..? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోవడం..ఎదుటివాళ్లపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని యనమల ఆరోపించారు.టీడీపీపై ఫిర్యాదులు చేసేందుకే విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా…ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారని అన్నారు. జగన్ షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయి రెడ్డేనని..వాటిని కప్పిపుచ్చుకోడానికే ఢిల్లీ స్థాయి పదవులు ఇచ్చారని చెప్పారు.
జగన్ రూ 43వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరిందని…ఇప్పటికే రూ 4వేల కోట్ల జగన్ ఆస్తులను ఈడీ జప్తు చేసిందని చెప్పారు. విచారణ తుది దశకు చేరడంతో కోర్టుకు హాజరు కాకుండా జగన్ ఎగ్గొడుతున్నారని యనమల ఆరోపించారు. శిక్ష తప్పదని తెలిసే ట్రయల్స్ ను అడ్డుకుంటున్నారని… 8 ఏళ్లుగా సీబీఐ, ఈడీ ఎంక్వైరీకి అడ్డంకులు పెడుతున్నారని… కోర్టుకు హాజరు కాకుండా పదేపదే మినహాయింపులు కోరేది అందుకేనని చెప్పారు. హైకోర్టులో సీబీఐ వేసిన పిటిషన్ కు ముందు జగన్ సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. 16నెలలు జైల్లో ఉండి వచ్చి, 16 ఛార్జిషీట్లు ఉన్న మీకు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా? అని అడిగారు.
టీడీపీ, వైసీపీ ఏది ఎలాంటి పార్టీయో ప్రజలందరికీ తెలిసిందేనని…టీడీపీ తప్పుడు పనులు చేసే పార్టీ కాదని… సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ అని… అందుకే 40 ఏళ్లుగా ప్రజల గుండెల్లో ఉందని యనమల చెప్పారు. వైసీపీ తప్పుడు పనుల్లో నుంచి పుట్టిన పార్టీ అని.. అక్రమార్జన కాపాడుకోడానికి పెట్టిన పార్టీ అని విమర్శించారు. చంద్రబాబుపై గతంలోనే 26ఎంక్వైరీలు వేశారు. సభా సంఘాలు, న్యాయ విచారణలు, సీబీసీఐడీ విచారణ చేసినా ఎందులోనూ వాళ్ల ఆరోపణలు రుజువు చేయలేక పోయారని గుర్తు చేశారు. టీడీపీపై సాక్షి మీడియా, వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని మానుకోకపోతే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.