రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నిరసన చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో పార్టీ నేతలంతా ప్రదర్శనగా వెళ్లి సచివాలయం ఫైర్ స్టేషన్ దగ్గర నిరసనకు దిగారు. ప్రదర్శనలో వరి కంకులు, పత్తి, మొక్కజొన్న కంకులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి చందంగా మారిందని విమర్శించారు. రైతు పండించిన పంటలు కొనే నాథులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. 6 నెలలుగా ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. రైతు సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మరో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.మరో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గిట్టు బాటు ధర చెల్లించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.