తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొండా ఉమా మహేశ్వరరావు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన దొంగ అని విమర్శించారు. దొరికిపోయిన దొంగలు ప్రతిపక్షాలు, మీడియా మీద నిందలు వేస్తున్నారని సెటైర్లు వేశారు. వివేకానంద హత్య కేసులో హై ప్రొఫైల్ ఉన్న కొందరు వ్యక్తులు కూడా బయటపడతారని చెప్పారు.
వివేకానంద హత్యకు సంబంధించి సాక్ష్యాలను అవినాష్ రెడ్డి నాశనం చేశాడని ఆరోపించారు. అయినా టెక్నాలజీ సహాయంతో సీబీఐ వాస్తవాలను బయటపెడుతుందన్నారు. దొరికిపోయిన దొంగలు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని బొండా పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత చేస్తున్న పోరాటం నిందితుల మెడకు బలంగా చుట్టుకుందని వ్యాఖ్యానించారు.
కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ముఖ్యమంత్రి జగన్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ సర్వే ద్వారా ఇంటికెళ్లిపోతామని జగన్ కు తెలిసిపోయిందన్నారు.
అందుకే లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, పార్టీ కార్యాలయాలపై దాడులు, కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. అతి త్వరలోనే ఈ దుర్మార్గపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పలకబోతున్నారని పేర్కొన్నారు బొండా ఉమ.