టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్లుగా తెలుగువారి కోసమే పనిచేస్తోన్న పార్టీ టీడీపీ అన్నారు. యువత, మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసిందని చెప్పారు. సమిష్టిగా కృషిచేసి తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు.
తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే స్థాపించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ అని అన్నారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్ ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు చంద్రబాబు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో మౌలిక వసతులు, సైబరాబాద్ నిర్మించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందన్నారు.
తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు, రెండో సీటు రజకులకు ఇస్తామని చెప్పారు. విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరికాదని, తెలంగాణలో సంపద సృష్టించడానికి కారణం టీడీపీనే అంటూ స్పష్టం చేశారు చంద్రబాబు. అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.