ఏపీ రాజధానిగా విశాఖను ప్రకటించటం వెనుక ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా. సీఎం జగన్ సూచనల మేరకు విశాఖపట్నం చుట్టు ప్రక్కల మధురవాడ, భోగాపురం ప్రాంతంలో విజయసాయి రెడ్డి తో పాటు వైకాపా నేతలు కొనుగోలు చేసిన 6వేల ఎకరాల భూములపై సీబీఐ విచారణ జరిగితే అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటో బట్టబయలవుతుందన్నారు.
జగన్ తెలివితక్కువ నిర్ణయాలతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి… కుల మతాలకు, ప్రాంతాలకు మధ్య చిచ్చు పెడుతున్నాడని దేవినేని ఆరోపించారు. ఏడు నెలలుగా కుట్రలు కుతంత్రాలతో కూడిన ఆలోచనలతో శాసన సభ్యులు, మంత్రులతో ప్రకటనలు గుప్పించి.. నేడు 9వేల కోట్ల పైనే పనులు జరిగిన అమరావతి గొంతుకోసేశారన్నారని మండిపడ్డారు.
అమరావతి కేంద్రంగా అన్ని శాఖలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఓర్వలేక, తట్టుకోలేని జగన్ ఇటువంటి కుట్రలకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్టు నేడు రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ముఖ్యమంత్రి తాడేపల్లి భవనంలో వీడియో గేములు ఆడుకుంటున్నారని, కక్షతో విద్వేషంతో రాజధాని పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై మంత్రులు ఇప్పటికైనా నోరు తెరవాలని డిమాండ్ చేశారు. 29గ్రామాల్లో దాదాపు 29వేల మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు యువత పురుగుమందు డబ్బాలతో ప్రాణ త్యాగాలకు సిద్ధపడే పరిస్థితి తెచ్చారని, అనంతపురం నుంచి విశాఖ వెళ్లాలంటే 890 కిలోమీటర్లు వెళ్ళాలి. కర్నూలు నుంచి 600కిలోమీటర్ల పైనే దూరం ఉంది. పిల్లచేష్టలతో అనుభవరాహిత్యంతో ముఖ్యమంత్రి తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం పక్కన పెట్టి తెలుగుదేశం ప్రారంభించిన అభివృద్ధిని కొనసాగించి, రాజధానిపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.