మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలతో ఏపీ అంతా అట్టుడుకుతోంది. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా.. ఏపీలోని కడప జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది.
ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా జగన్ ప్రచారం చేయించుకున్నారని.. తన ఇలాఖా కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే గన్ ఎక్కడ..? జగన్ ఎక్కడ..? అంటూ ప్రశ్నించారు లోకేష్.
అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ నిలదీశారు. పదిహేనేళ్లు కూడా నిండని బాలికను గర్భవతిని చేసిన నిందితులను కాపాడటమేనా మీరు ఆడబిడ్డలకి కల్పించే రక్షణ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో మహిళలపై రోజుకో చోట అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల అర్థరాత్రి భర్త చూస్తుండగానే రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మరవకముందే మరో ఘటన జరగడం బాధగా ఉందన్నారు లోకేష్.