విజయదశమి రోజు ఇద్దరు నేతలు వైసీపీలో చేరారు. అందులో వొకరు జూపూడి ప్రభాకర్. మొన్నీ మధ్య వరకు టీడీపీ తరుఫున జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టిపోసి ఇప్పుడు జనం ఏమనుకుంటారని కూడా లేకుండా జంప్ చేసేశారు. ఇవాళారేపు ఈ గోడ దూకుళ్లు కామనే అయినా చేరీ చేరగానే జూపూడి చిడతలు అందుకున్నారు. జగన్‌ని ఫెడరల్ క్యాస్ట్రో అన్నారు. విజయసాయిరెడ్డిని ఆంధ్రా ఐరన్ మ్యాన్ అని ఆకాశానికి ఎత్తేశారు.
గుంటూరు: జూపూడి ప్రభాకర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. నిర్దిష్ట ఆలోచన లేకుండా గొర్రెల్లా పక్కదారి పట్టామని పశ్చాత్తాప పడ్డారు. రాజకీయంగా తన వైపు జరిగిన కొన్ని తప్పులను సరిదిద్దుకుంటానని తేల్చారు.
జగన్‌లో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నడని, విజయసాయిరెడ్డి ఆంధ్రా ఐరన్ మ్యాన్ అనిపించుకుంటున్నాడని అన్నారు. పదవులు ఆశించి వైసీపీలోకి రాలేదని క్లారిటీ ఇచ్చారు.
మరోపక్క జనసేన అభ్యర్థిగా ఎంపీ స్థానానికి పోటీచేసిన ఆకుల సత్యనారాయణ కూడా ఇవాళ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జగన్ ఆలోచనలు నచ్చి పార్టీలో చేరానని తరువాత మీడియాతో అన్నారు.
హామీల అమలుకు సీఎం శ్రీకారం చుట్టారని ఆకుల అభినందించారు. మద్యపానం నిషేధం దిశగా సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.